టీజర్ టాక్ః అబద్దం ఆడాల్సిందే

22

చాలారోజుల నుండి పోస్టర్లతోనే మ్యాజిక్ చేస్తున్నారు హీరో నితిన్ మరియు డైరక్టర్ హను రాఘవపూడి. తాము తెస్తున్న ‘లై’ లో ఉన్న బ్యూటి గురించి ఒకసారి.. అబద్దం గురించి ఒకసారి.. ఇంటెలిజెన్స్ గురించి ఒకసారి పోస్టర్లు విడుదల చేస్తూ చాలా ఇంప్రెస్ చేశారు. అయితే అంతటి స్టయిలిష్ పోస్టర్లు ఉన్న చాలా సినిమాల్లో ఈ మధ్యకాలంలో లోపల కంటెంట్ మాత్రం కనిపించట్లేదు. మరి ‘లై’ పరిస్థితి ఏంటంటారు? పదండి చూద్దాం.
మొన్నటివరకు ఎమోషనల్ లవ్ స్టోరీలకు కలర్ ఫుల్ గా తీస్తాడు అనిపించుకున్న హను రాఘవపూడి.. ఈసారి స్టయిలిష్ మేకింగ్ తో అదరగొట్టేశాడు. టీజర్ లో స్టయిల్ చాలా డామినేట్ చేసేసింది. ఇకపోతే సినిమా థీమ్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. ”సాక్షాత్తూ పాండవులు సైతం అబద్దం ఆడితేనే యుద్దం గెలవగలిగారు. శ్రీకృష్ణుడు అంతటోడే అబద్దం ఆడించాడు. అశ్వద్దామ హతః కుంజరహా” అనే థీమ్ తో రూపొందిన ఈ సినిమాలో.. ఇటు నితిన్ స్టయిలిష్ లుక్.. అటు సీనియర్ హీరో అర్జున్ స్టయిలిష్ విలన్ లుక్ అదిరిపోయాయ్. ముఖ్యంగా మణివర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమా థీమ్ ను బాగా ఎలివేట్ చేసింది. ఓ రకంగా ఈ సినిమాపై ఇప్పటివరకు సినిమాపై ఏమన్నా ఎక్కడన్నా అంచనాల విషయంలో లోపం ఏదన్నా ఉంటే.. ఇప్పుడు అవన్నీ బ్లాస్ట్ అయిపోయి హైప్ డబుల్ అయిపోయే ఛాన్సుంది.
‘అ..ఆ’ సినిమా తరువాత నితిన్ తన లుక్స్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లే కనిపిస్తున్నాడు. ఇప్పుడు కూడా లుక్స్ తో ఇంప్రెస్ చేస్తూ.. మనోడు కంటెంట్ తో కూడా గట్టిగా వచ్చాడంటే మాత్రం ఇక పంద్రాగస్టు వీకెండ్ మనోడికి రెడ్ కార్పెట్ వేసినట్లే. ‘లై’ సినిమా ఆగస్టు 11న రిలీజవుతోంది